తెలంగాణలో కాకతీయ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టించింది. సీనియర్ విద్యార్థిని వేధింపుల కారణంగానే విద్యార్థిని ఈ ప్రయత్నానికి పాల్పడిందంటూ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను డీఎంవో రమేష్ రెడ్డి కొట్టిపారేశారు. ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని వైద్య విద్య డైరెక్టర్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రీతి కేసు దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నిమ్స్‌లో తన కుమార్తెకు సరైన వైద్యం అందడం లేదని బాధితురాలి తండ్రి నరేంద్ర ఆరోపిస్తున్నారు. నిన్నటి నుంచి తన కూతురు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా స్పందించడంలేదని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే కాసేపటి క్రితమే ప్రీతి పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, కొన్ని అవయవాలు ఫెయిల్ అయ్యాయని వారు తెలిపారు. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, ఈసీఎంవో సపోర్ట్ అందిస్తున్నామని నిమ్స్ వైద్యులు తెలిపారు.
నిమ్స్‌లో ఐదుగురు నిపుణులైన వైద్యుల బృందం ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ వైద్యులు ఆమెకు వైద్యం అందించడంలో తమ వంతు కృషి చేస్తున్నారని తెలిపారు.
వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించే సమయంలో ప్రీతి గుండె ఒకటి రెండు సార్లు ఆగిపోయిందని చెబుతున్నారు. ఆమెకు సీపీఆర్ చేసిన తర్వాత గుండె మళ్లీ పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు.
జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్న ప్రీతిని ఓ సీనియర్ వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో మానసిక ఒత్తిడికి గురైన ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుంది. ఆమెను ఎమర్జెన్సీ అవార్డుకు తరలించిన తర్వాత ఆమెకు అవసరమైన చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు.